మైలవరం,జమ్మలమడుగు, నవంబర్ 30
–
పెన్నానది వరద నీరు తగ్గిన వెంటనే జమ్మలమడుగు ముద్దనూరు ప్రధాన రహదారిపై ఉన్న మెయిన్ బ్రిడ్జి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా కూడా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారంమైలవరం జలాశయమును సందర్శించి కరకట్టల పరిస్థితులు, బాగోగులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత 10 రోజులుగా జమ్మలమడుగు ముద్దనూరు ప్రధాన రహదారి బ్రిడ్జి కుంగిపోవడంతో జమ్మలమడుగు మండల పరిధిలోని 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు తాత్కాలికంగా మైలవరం జలాశయం కట్టమీద ప్రయాణానికి ఇబ్బంది లేకుండా తాను జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అనుమతులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
మైలవరం కట్ట వెంబడి ప్రయాణికులు వాహనాలలో ప్రయాణం చేయడం వలన జలాశయం కట్టకు ఇబ్బందులు ఎదురవుతాయని ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రయాణికులు పెద్ద పెద్ద వాహనాలు కాకుండా 17 గ్రామాల ప్రజలు వ్యక్తిగత మోటార్ సైకిళ్ల మీదనే ప్రయాణించేలా ప్రజలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులను సూచించారు. మైలవరం జలాశయం కట్టమీద ఒక్కొక్కరుగా ప్రయాణం చేసేలా పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కట్టమీద ప్రయాణం చేస్తున్న వాహన చోదకులకు ఎమ్మెల్యే దగ్గర ఉండి ఒక్కొక్కరు ప్రయాణం చేసేలా సూచించడం జరిగింది.
*అలాగే మైలవరం జలాశయ కరకట్టల మరమ్మతుల పనులు పెండింగ్లో ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు