న్యూఢిల్లీ నవంబర్ 8
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం.. ప్రజలను నిస్సహాయ స్థితిలోకి నెట్టారంటూ ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న క్రోనీ క్యాపిటలిజం, రైతు వ్యతిరేక విధానాలతో ఏడేళ్లలో రైతులు ఆత్మహత్యలకు బలయ్యారని విమర్శించింది. 2014-2020 మధ్య కాలంలో 9,58,275 మంది భారతీయు ఆత్మహత్యలు చేసుకొని, తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించారంటూ భారత్‌లో ఆత్మహత్యలు, ప్రమాద మరణాలపై ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్ సి ఆర్ బి) విడుదల చేసింది.
ఈ నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య 55శాతం, నిరుద్యోగుల్లో 58శాతం, రైతులు, కూలీలు, దినసరి కూలీల్లో 198.37శాతం పెరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతతో అభాగ్యులు తమ చివరి ఆశను కోల్పోయి ప్రాణాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలో గడిచిన 7 సంవత్సరాల్లో 78,303 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందులో 35,122 మంది రైతు కూలీలేనని చెప్పారు. 2019 నుంచి 2020 వరకు ఆత్మహత్యల సంఖ్య 19 శాతం పెరిగిందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. పెరుగుతున్న ఖర్చులు, కనీస మద్దతు ధర లేకపోవడమే ఆత్మహత్యలకు కారణాలన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రైవేటు బీమా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చిందని విమర్శించారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని.. 2014-2020 మధ్య 69,407 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆక్స్‌ఫామ్ నివేదికను ఉటంకిస్తూ 100 మంది భారతీయుల సంపద రూ.13లక్షల కోట్లు పెరిగిందని.. 12 కోట్ల మంది భారతీయుల ఉద్యోగాలు కోల్పోయారని విమర్శించారు. 2014 నుంచి 2020 మధ్య కాలంలో 1,52,127 మంది గృహిణులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2014తో పోలిస్తే 2020లో భారతదేశంలో ఆత్మహత్యల రేటు 16 శాతం పెరిగిందంటూ ధ్వజమెత్తారు.