విజయవాడ
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్డేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పోలీసుల బాగోగుల గురించి ఆలోచించాం. దేశంలోనే మొట్టమొదటిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు.