న్యూఢిల్లీ డిసెంబర్ 2
ఇండియాలో ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని, ఆ రెండూ కర్నాటకలోని బెంగళూరులో నమోదు అయినట్లు ఆయన చెప్పారు. జీనోమ్ పరీక్షల ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు ద్రువీకరించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటి వరకు 373 మందికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారన్నారు. 66, 46 ఏళ్లు ఉన్న ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.
జీనోమ్ సీక్వెన్సింగ్..
కేంద్ర ఆరోగ్యశాఖ ఆధీనంలో ఉన్న 37 ల్యాబ్‌ల ఇన్‌సాకాగ్ కాన్సార్టియమ్ చేపట్టిన జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించామని ఐసీఎంఆర్ డీజీ బల్‌రామ్ భార్గవ్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అవగాహన తప్పనిసరి అన్నారు. సరైన కోవిడ్ ప్రవర్తనానియమావళి పాటించాలని భార్గవ్ చెప్పారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన కర్నాటక వాసుల కాంటాక్ట్‌లను గుర్తించామని, వారిని మానిటర్ చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు ఉంటాయని అగర్వాల్ తెలిపారు.
పాజిటివ్ వస్తే.. క్లినికల్ చికిత్స
హై రిస్క్ ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం వెల్లడించింది. ఒకవేళ ఎవరైనా పాజిటివ్ తేలితే.. వారికి క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్సను అందించనున్నారు. ఒకవేళ నెగటివ్ వస్తే, వారికి ఏడు రోజుల హోం క్వారెంటైన్ ఉంటుందని లవ్ అగర్వాల్ తెలిపారు.
స్పల్ప లక్షణాలు
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు ఏమీ రిపోర్ట్ కాలేదని అగర్వాల్ చెప్పారు. అన్ని ఒమిక్రాన్ కేసుల్లో స్పల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ ఆ కేసుల్లో తీవ్ర లక్షణాలు నమోదు కాలేదన్నారు. అయితే ఆ వేరియంట్‌ను క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ పూర్తిగా వ్యాక్సినేట్ కావాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ తెలిపారు.
70 శాతం కేసులు యూరోప్‌లో..
దేశవ్యాప్తంగా 49 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండవ డోసు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. యురోపియన్ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో దాదాపు 70 శాతం కేసులు అక్కడే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన వారంలో కేవలం యూరోప్‌లోనే 70 శాతం కేసులు నమోదు అయినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. ఇండియాలో కేరళ, మహారాష్ట్రలో సగటున పదివేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇండియాలో నమోదు అవుతున్న కేసుల్లో 55 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.