న్యూ డిల్లీ
2021 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో 119 మందికి పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందించారు.సోమవారం ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డులను అందుకున్న వారిలో మేఘాలయాకు చెందిన మహిళా రైతు, 94 ఏళ్ల వర్కింగ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు.మిజోరామ్‌కు చెందిన 94 ఏళ్ల జర్నలిస్ట్ లాల్‌బియాక్తంగ పచావ్ అవార్డును అందుకున్నారు. సాహిత్యం, విద్య మీద ఎన్నో విశ్లేషణాత్మకమైన కథనాలు రాసి జర్నలిజంలో సరికొత్త ఒరవడిని సృష్టించినందుకు పచావ్‌కు ఈ గౌరవం దక్కింది.మరోవైపు మేఘాలయాకు చెందిన మహిళా రైతు ట్రినిటీ సైవోకు వ్యవసాయంలో తను చేసిన సేవలు, ఎందరో రైతులకు మార్గదర్శిగా నిలిచి.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.ట్రినిటీ సైవోకు ఆరుగులు పిల్లలు. 8 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. మేఘాలయాలోని వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని ములెహ్ గ్రామం తనది. పసుపులో సరికొత్త వంగడం లకాడోంగ్‌ను పండించి.. అక్కడి రైతులకు ఆదర్శంగా నిలిచి.. వాళ్లకు ఈ వంగడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడంలో ఆమె సఫలం అయ్యారు. ఈ రకం పసుపుకు ప్రపంచ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే.. అక్కడి రైతులకు ఈ రకం పంటపై అవగాహన కల్పించి.. అక్కడ మొత్తం ఈ పంట పండించేలా వాళ్లు శిక్షణ ఇచ్చి.. ఆ పంట ద్వారా వాళ్లు ఆర్థికంగా స్థిరపడేలా చేశారు.దేశంలోనే అత్యంత వృద్ధ జర్నలిస్ట్‌గా ఉండటమే కాకుండా.. 94 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ పచావ్.. జోరమ్ టయాంగోఅనే పత్రికలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. పచావ్ ఆర్మీలోనూ పనిచేశారు. ఆర్మీలో రిటైర్ అయ్యాక జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.