హైదరాబాద్ అక్టోబర్ 11
‘డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్’ లక్ష్య సాధనలో మనమంతా భాగమై బాలికలకు డిజిటల్ విద్య అందించి, వారి గొప్పతనాన్ని వెలికితీసి ప్రపంచానికి చాటడంలో పూర్తి తోడ్పాటు అందించాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్’ అనే నినాదంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు ఆగిపోవద్దనేదే దీని ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బాలురకు సమానంగా.. బాలికల విద్యకు, విద్యా సంస్థలలో డిజిటల్ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు, బాలికలకు రక్షణ కల్పిస్తున్నామని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్ గా నిలిచిన బాలికలకు రూ.2500, రూ.5 వేలు, రూ.10 వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు.