నల్లగొండ అక్టోబర్ 13
జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డిఐజి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితులలో సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు.అందుకు అనుగుణంగా గంజాయిపై గత రెండు నెలలుగా వరుసగా చేస్తున్న దాడుల క్రమంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. తాము తీసుకుంటున్న చర్యల కారణంగా జిల్లాలో గంజాయి రవాణా, విక్రయించాలంటే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్న క్రమంలో సింథటిక్ డ్రగ్స్ వైపుకు యువత ఆకర్షితులవుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.అందువల్ల మెడికల్ షాపుల నిర్వాహకులు తరచుగా మత్తు మందుల కోసం వచ్చే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అదే సమయంలో మెడికల్ షాపుల నిర్వాహకులకు రక్షణ కల్పించే విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.మత్తు మందుల కారణంగా యువత నిర్వీర్యం అయి దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంలో కీలకమైన యువత భవిష్యత్ మత్తు మందుల బారిన పడి నిర్వీర్యం కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయించినా మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయడం, పీడీ యాక్టులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, డ్రగ్ కంట్రోల్ ఏ.డి. శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్ పెక్టర్ వరప్రసాద్, కెమిస్ట్ అసోసియేషన్ నాయకులు సిరిప్రోలు వెంకటపతి, జి. వెంకటేశ్వర్లు, సిఐలు బాలగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మధు, సురేష్ కుమార్, రాఘవులు సత్యనారాయణ, నాగరాజు, నిగిడాల సురేష్, శంకర్ రెడ్డి, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, నర్సింహులు, నాగరాజు, యాదయ్య తదితరులున్నారు