ముంబై నవంబర్ 26
బలవంతపు వసూళ్ల ఆరోపణలు రావడంతో విధుల నుంచి బహిష్కరణకు గురైన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఇవాళ కోర్టులో హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఇవాళ థానే కోర్టుకు హాజరు కావడంతో కోర్టు ఆయనపై జారీచేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేసింది. పరమ్ బీర్ సింగ్ కనిపించకుండా పోవడంతో థానే కోర్టు ఇటీవలే పరమ్ బీర్ సింగ్ కోసం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయనే స్వయంగా కోర్టుకు రావడంతో ఆ వారెంట్‌ను రద్దుచేసింది.అయితే, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను రద్దు చేస్తూనే కోర్టు ఆయనకు కొన్ని ఆదేశాలు జారీచేసింది. కేసు దర్యాప్తులో థానే పోలీసులకు సహకరించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. అదేవిధంగా రూ.15,000 విలువైన వ్యక్తిగత బాండ్‌ను పూచీకత్తుగా సమర్పించాలని ఆదేశించింంది.