ఏలూరు
విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరవీరుల అందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తూనట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కోన్నారు.
ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ – పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత, పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమని మంత్రి చెప్పారు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది, ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు, ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే అని మంత్రి ఆళ్ల నాని పేర్కోన్నారు. దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21 తేదీన మన అందరము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు వీరమరణం పొందారని మంత్రి ఆళ్ల నాని గుర్తుచేశారు.
ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో గురువారం జరిగిన పోలీస్ అమర వీరుల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పోలీసులు నుండి గౌరవ వందనం స్వీకరించారు. అమర వీరుల స్తూపం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఆవరణలో పోలీస్ అమరవీరుల స్మారక స్థూపానికి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, డిఐజి కె వి మోహన్ రావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తదితరులు పాల్గోన్నారు.