కరీంనగర్
ఇస్లామిక్.. షరియత్ ప్రకారం.. ఖురాన్..చెప్పిన విధంగా పేదలకు వడ్డీలేని రుణాలు అందించడానికి గత 10 సంవత్సరాలుగా ఇస్లామిక్ బ్యాంకింగ్ ను దిగ్విజయంగా నడుపుతున్న కరీంనగర్ ఖాదీమానే మిల్లత్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా సహకార శాఖ ఆడిట్ అధికారి మనోజ్ కుమార్ అన్నారు. బుధవారం పికాక్ కాంప్లెక్స్ లోని ఖాదీమానే మిల్లత్ కార్యాలయంలో 10 మందికి ఒక లక్షా 29వేల రూపాయల..వడ్డీలేని రుణాలను అందజేశారు. వడ్డీతో కూడుకున్న రుణాలతో పేదవారి రక్తం పీల్చి పిప్పి చేస్తున్న సంఘటనలు ఎన్నో చూశామని..వడ్డీలు కట్టలేక ఎంతోమంది ఆత్మహత్యల బారిన పడ్డారని..ఆస్థులు.. ఇండ్లు.. వాహనాలు.. బంగారు ఆభరణాలు అమ్ముకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు రుణాలు తీసుకున్న లబ్ధిదారులు సరైన సమయానికి చెల్లించాలని.. తద్వారా ఇతరులకు రుణాలు ఆపద సమయంలో తోడ్పాటునందించే అవకాశం ఉంటుందన్నారు. ఖాదీమానే మిల్లత్ కార్యదర్శి సమద్ నవాబ్ మాట్లాడుతూ రుణాలు చెల్లించకుండా తాత్సరం చేయొద్దని.. సంస్థ అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈసందర్భంగా మనోజ్ కుమార్ ను ఖాదీమానే మిల్లత్ బాధ్యులు శాలువాతో సత్కరించారు. ఈకార్యక్రమంలో మీర్జా అంజదుల్లా బేగ్..సయ్యద్ ఫసియుద్దీన్..మహ్మద్ హామీదుద్దిన్..మక్బుల్ హుస్సేన్..మహమ్మద్ ఖురేషీ..సయీదుద్దిన్..ఇమ్రాన్ ఖాన్..సర్వర్ షా బియాబాని తదితరులు ఉన్నారు.