జగిత్యాల, సెప్టెంబర్ 28
ఎప్పటినుంచో ఉన్న రోడ్డుపై ఇప్పుడు గోడకట్టి కబ్జాకు పాల్పడుతున్నారని దారి కల్పించి న్యాయం చేయాలని పట్టణంలోని దేవినగర్ ప్రజలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మంగళవారం గొల్లపల్లి రోడ్డులోని మూడోవార్డులోని దేవినగర్ ప్రజలు గొల్లపల్లి రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని రాస్తారోకో దిగారు. గొల్లపల్లి రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పక్కన ఎప్పటి నుంచో రహదారి ఉందని కాలనీ వాసులు పేర్కొన్నారు. బతికేపెళ్లి సర్పంచ్ శోభారాణి ఈ స్థలం నాది అంటూ దారిలో గోడకట్టి ఆక్రమణకు పాల్పడుతోందని దేవినగర్ వాసులు ఆరోపించారు. జిల్లాలోని సంబంధిత ఆధికారులు స్పందించి మా బాధను అర్థం చేసుకొని మాకు దారి చూపించి న్యాయం చేకూర్చాలని అధికారులను వేడుకొన్నారు. గంటపాటు చేపట్టిన రాస్తారోకో తో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని ఆందోళనకు దిగిన దేవినగర్ ప్రజలను శాంతింపచేసి అధికారులను ఆశ్రయించాలని సూచించారు. అధికారులు తమకు న్యాయం చేయకుంటే నిరంతర ఆందోళనలు చేపడతామని దేవినగర్ వాసులు హెచ్చరించారు.