నంద్యాల, అక్టోబర్ 07
ఆక్షేపణలేని ప్రభుత్వ భూముల్లో 15-10-2019 తేదీ నాటికి ఆక్రమణలో గల నివాస గృహములు (300 చ.గజాల) వరకు క్రమబద్ధీకరించబడునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యా సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు .225 తేది : 23.08.2021 ఉత్తర్వులు జారీ చేసిందని, కావున ప్రభుత్వం వారు పొందుపరచిన షరతుల దృష్ట్యా అర్హులైన వారు ” సచివాలయం / వార్డు ” కేంద్రాల ద్వారా వారి వివరాలను పొందుపరచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సదరు ఉత్తర్వుల ప్రకారము క్రింద కనబరచిన ప్రకారము ఆక్షేపణలేని ప్రభుత్వ భూముల్లో అక్రమాలను క్రమబద్దీకరణ చేస్తామన్నారు.
75 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం, కుటుంబం కేటగిరీ-1 కి చెందినది మరియు డి ఫారం పట్టాను ఉచితంగా పొందాలనే ఉద్దేశంతో ఆరు దశల ధ్రువీకరణ అర్హత పొందినట్లయితే, ఆమెరకు డి ఫారం పట్టా జారీ చేయబడుతుందన్నారు .
150 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం.
150+300 చదరపు గజాల విస్తీర్ణం వరకు : (కేటాయించుటకు చెల్లించాల్సిన ధర) భూమి యొక్క ప్రాథమిక విలువలో 100 శాతం .
కేటగిరి 1 : గ్రామీణ ప్రాంతము
1)సదరు ఆక్రమణ దారు కుటుంబము నెలసరి ఆదాయము అన్ని వనరుల నుండి రూ.10,000/- అనగా సంవత్సరమునకు రూ.1,20,000/- ఆదాయం కలిగి ఉండాలి.
2)10 ఎకరముల మెట్ట భూమి లేదా 3 ఎకరముల తరి భూమి లేదా మెట్ట భూమి మరియు తరి భూమి కలిపి 10 ఎకరముల భూమి వరకు సదరు కుటుంబము కలిగి ఉండవచ్చును.
3)సదరు కుటుంబము నందు ఆదాయపు పన్ను కట్టు సభ్యులు ఉండరాదు.
4)సదరు కుటుంబమునకు 4 చక్రముల వాహనము ఉండరాదు. కాని కుటుంబమునకు టాక్సీ, ఆటో, ట్రాక్టర్ వ్యవసాయమునకు ఉన్నచో మినహాయింపు గలదు.
కేటగిరి 1 : పట్టణ ప్రాంతము :-
1)సదరు ఆక్రమణ దారు కుటుంబము నెలసరి ఆదాయము అన్ని వనరుల నుండి రూ.12000/- అనగా సంవత్సరమునకు రూ.1,44,000/ – వరుకు ఉండవచ్చును.
2)సదరు కుటుంబము నందు ప్రభుత్వ ఉద్యోగం చేయు సభ్యులు ఉండరాదు. ఐతే కాంట్రాక్టు ఉద్యోగం చేయు వారు ఉండవచ్చును.
3)సదరు కుటుంబము నందు ఆదాయపు పన్ను కట్టు సభ్యులు ఉండరాదు.
4)సదరు కుటుంబమునకు 4 చక్రముల వాహనము ఉండరాదు. కానీ కుటుంబమునకు టాక్సీ, ఆటో, ట్రాక్టర్ వ్యవసాయమునకు ఉన్నచో మినహాయింపు గలదు.
ఇందుకు సంబందించిన దరఖాస్తులను సంబంధిత సచివాలయం/వార్డు కార్యాలయము 31-12-2021 లోగా సమర్పించాలని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అట్లు సమర్పించని యడల రెవిన్యూ అధికారులు సదరు ఆక్రమణను తొలగించుటకు చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటారని సబ్ కలెక్టర్ తెలియజేశారు.