తిరుపతి
టిటిడి ఉద్యోగుల శ్రేయస్సే పాలక మండలి ప్రధాన లక్ష్యమని టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. గురువారం అలిపిరి లింక్ బస్ స్టాండ్ వద్ద టిటిడి ఉద్యోగుల కోసం వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింక్ బస్టాండ్ ప్రాంగణంలో తిరుమలకు విధుల నిమిత్తం వెళ్లే ఉద్యోగస్తులందరూ తమ ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసి వెళుతుంటారని,ఇటివల కాలంలోనే దాదాపు 20 వాహనాలకు పైగా దొంగతనానికి గురైనట్లు తెలిసిందని, అంతేకాకుండా వాహనాల్లో పెట్రోల్ కూడా దొంగలిస్తున్నట్లు ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగస్తుల సంక్షేమం కోసం తమ పాలకమండలి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డితో చర్చించి అలిపిరి ప్రాంగణంలోనే నూతనంగా షెడ్డు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలను అమర్చి, సెక్యూరిటీ గార్డ్ ను కూడా ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. శ్రీవారి భక్తులకు చిత్తశుద్ధితో సేవలందిస్తున్న ఉద్యోగస్తుల సంక్షేమాన్ని పాలక మండలి ఎప్పుడూ విస్మరించదని, వారి సంక్షేమం కోసం త్వరలోనే వాహనాల పార్కింగ్ షెడ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం షెడ్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవిఎస్వో శైలేంద్ర కుమార్, డిఈ సురేంద్ర నాథ్ రెడ్డి,ఏఈ శ్రీనివాసులు,సురేష్,పోలంపల్లి గిరిబాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.