శ్రీశైలం
అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మహోత్సవ నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్లపై సోమవారం రోజున సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, వేదపండితులు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది ఈ సమీక్షా సమావేశములో పాల్గొన్నారు. ఈ సమావేశములో కార్యనిర్వహణాధికారివారు ప్రారంభ ప్రసంగాన్ని చేస్తూ ముఖ్యంగా కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాల్సి వుందన్నారు. కాగా సమావేశములో ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్మింగ్, దర్శనం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి కూలంకుషంగా చర్చించారు. ఉత్సవరోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని కార్యనిర్వహణాధికారి వైదిక సిబ్బందికి సూచించారు. అదేవిధంగా వైదిక కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కూడా సూచించారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాలలో కూడా గత సంవత్సరము వలనే శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం వుండదు. ఉత్సవ సమయములో ప్రతిరోజూ ఆలయ ఉత్సవం మాత్రమే జరుపుతారు. భక్తులు, సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాని అధికారులు వెల్లడించారు.