అహ్మదాబాద్ నవంబర్ 15
గుజరాత్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మోర్బీ జిల్లాలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తూ దొరికారు. దాంతో వారిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ అధికారులు, వారి నుంచి 120 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తుమందు విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.గల్ఫ్ ఆఫ్ కచ్‌లోని నవ్‌లఖి పోర్టు సమీపంలోగల ఝింజుడా గ్రామంలో నిందితులు పట్టుబడ్డారు. నిందితులు పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గాన డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఏటీఎస్ అధికారులు చెప్పారు. కాగా, మరోసారి డ్రగ్స్ ముఠా ఆటకట్టించిన గుజరాత్ పోలీసులను ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి అభినందించారు. హెరాయిన్ పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడిస్తారని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ముంద్రా పోర్టులో కూడా రూ.21 వేల కోట్ల విలువచేసే 3000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి.