విజయవాడ నవంబర్ 3
రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని, మంత్రి పదవులు కూడా పోషించిన నాయకులు ఆ తర్వాత అన్నీ వదిలేసి సాధారణ జీవితం గడపడం అరుదు. అయితే అలాంటి పనే చేసి చూపించారు రఘువీరా రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.అయితే కొంతకాలంగా రాజకీయాలను పక్కనపెట్టేసిన ఆయన సామాన్య జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్యతో కలిసి బైక్‌పై వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఆయన సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఈ క్రమంలో ఆయన తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. ఈ ఫొటోల్లో రఘువీరాను ఒక స్తంభానికి కట్టేసి ఉన్నారు. తాడుతో తనను ఇలా కట్టేసిన ఫొటోలను షేర్ చేసిన ఆయన.. ‘తనతో ఎక్కవ సేపు గడపడం లేదని కోపం తెచ్చుకున్న నా మనుమరాలు సమైరా.. ఇంట్లోనే ఉండి తనతో ఆడుకోవాలంటూ నన్ను ఇలా కట్టేసింది’ అంటూ ఆయన ఒక పోస్టు పెట్టారు. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.