ఆధునికుల దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే? వారాంతాల్లో, సెలవు దినాల్లో విలాసంగా, విశ్రాంతిగా గడపడం కోసం ఎకరమో, రెండెకరాల్లోనో కట్టుకున్న ప్రత్యేకమైన ఇల్లు. కానీ పల్లె జీవితానికే అలవాటుపడ్డ ఒక రైతు దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే? తను వ్యవసాయం చేసుకోవడానికి నిరంతరం అందుబాటులో ఉండేలా పొలం మధ్యలోనే కట్టుకున్న పొదరిల్లు. కేసీఆర్ అలాంటి రైతే. ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు, ఆయన తనకిష్టమైన వ్యవసాయాన్నీ చేస్తుంటారు… ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో! సాగు విధానాలపై అనేక ప్రయోగాలూ చేస్తూ పర్యవేక్షిస్తారు. కేసీఆర్ వ్యవసాయ నిపుణులను ఎర్రవల్లి ఇంటికి రప్పించుకుని, సాగు విధానాలపై చర్చిస్తూ ఉంటారు. కొత్త ప్రయోగాలు చేసిన రైతులను అక్కడ కలుసుకుంటారు. తను ముఖ్యులని భావించే అతిథులకు, ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో కాకుండా, తన సొంత ఇైల్లెన ఎర్రవెల్లిలో ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. అక్కడైతే ఆత్మీయత ఉంటుందనేది ఆయన భావన. ఆ పంట పొలాలు, మడికట్లు, గట్లు, పచ్చని చెట్లు… 68 ఏండ్ల వయసున్న కేసీఆర్‌ను అధికార బాధ్యతల ఒత్తిడి నుంచి బయటపడేసి రీచార్జ్ చేస్తాయి. రైతులకు సంబంధించి వాటితో పాటు, అనేక పథకాలు, వాటి పేర్లు పురుడు పోసుకున్నది ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే!