నిజామాబాద్ అక్టోబర్ 29
ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని వేల్పూర్ మండలం లక్కోర గ్రామం, భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామాల్లో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు గోడౌన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు.రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించిన సికింద్రాపూర్ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. తరగతి గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్థానిక ఎంపిటిసికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే ఏర్గట్ల మండల కేంద్రంలో రూ.7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.5లక్షల వ్యయంతో నిర్మించిన నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగు నీరు, విరివిగా నిర్మించిన చెక్ డ్యాములు, చెరువులు పూడికతీత ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగి కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న బోర్ల ద్వారా ఎకరం కూడా బీడు లేకుండా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.