Home ఆంధ్రప్రదేశ్ ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌ల మాల‌ల‌తో శోభాయ‌మానంగా స్నపనతిరుమంజనం

ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌ల మాల‌ల‌తో శోభాయ‌మానంగా స్నపనతిరుమంజనం

240
0

తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌ల మాల‌ల‌తో స్నపనతిరుమంజనం (పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు మ‌రియు కంకణభట్టార్‌ శ్రీ శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో ముత్యాలు, మొక్క‌జొన్న, గుమ్మ‌డి గింజ‌లు, తామ‌ర‌పూల గింజ‌లు, అత్తి ఫ‌లం, రోజాలు, ముత్యాల రోజాలు, తుల‌సి మాల‌లు, కిరీటాలు, గొడుగులు అమ్మవారికి అలంకరించారు.

Previous articleస‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్షాల ఆందోళ‌న
Next articleఇస్లామిక్ విద్య..సాంప్రదాయ పద్ధతులను ఆచరించేలా సేవలందించాలి జమియత్-ఉల్-హుఫ్ఫాజ్ ఉపాధ్యక్షుడు హాఫిజ్ జియాఉల్లాహ్ ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here