గుంటూరు
పల్నాడులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే మా ద్వేయమని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. గురజాల, దాచేపల్లి పరిధిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన భద్రత ఏర్పాట్ల గుఠించి స్థానిక పోలీస్ అధికారులతో అయన సమీక్ష నిర్వహించారు. ప్రశాంత వాతావరణములో ఎన్నికల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తరువాత గురజాల పట్టణంలోని స్థానిక ఎంపిపి హిందు, ఉర్దూ పాఠశాలను, దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి స్థానిక పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగినదని,భద్రత ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో గడచిన వారం రోజుల నుండి మా పోలీస్ అధికారులు సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను,పాత నేరస్తులను,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించారని తెలిపారు. అదే విధంగా బందోబస్తు పరంగా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ముందస్తుగా సమాచారాన్ని సేకరిస్తూ మా ఎస్సై నుండి డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో అక్కడ ఎక్కువ మంది సిబ్బందిని నియమించి ఎన్నికల సమయములో ఎటువంటి అవాంఛానీయ సంఘటనలు జరుగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వేచ్చగా,నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణములో ఎన్నికలను నిర్వహించడానికి స్థానిక పోలీసులతో పాటు 11 ప్రత్యేక పోలీస్ బలగాలను,ఏఆర్ సిబ్బందిని కేటాయించి, మొత్తం 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. రెవిన్యూ, మునిసిపల్ మరియు ఇతర శాఖల సమన్వయముతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ కెడింగ్,క్యూలైన్ల వంటివి ఏర్పాటు చేపిస్తున్నామని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా,చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన లేదా అసత్య ప్రచారాలు చేసిన చట్టపరంగా కేసులు నమోదు చేసి,తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.