నెల్లూరు
స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కరించాలన్నారు.
ఎక్కువగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రతి వారం వీటిపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయన్నారు. అలాగే సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన అర్జీలు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన అర్జీలను ముందుగా పరిశీలన చేసి, అనంతరం పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు హరేంధిర ప్రసాద్, విదేహ్ ఖరే, రోజ్ మాండ్, డిఆర్ఓ చిన్న ఓబులేసు, తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావు, డ్వామా, హౌసింగ్ పిడిలు తిరుపతయ్య, వేణుగోపాల్, డి.ఎస్.ఒ వెంకటేశ్వర్లు, డిపిఓ ధనలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణ మోహన్, వ్యవసాయ శాఖ జె.డి ఆనంద్ కుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.