తిరుపతి ,మా ప్రతినిథి, నవంబర్ 05, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ పుణ్య క్షేత్రంలో పునర్నిర్మించిన శ్రీ ఆది శంకరాచార్యుల వారి సమాధిని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు.
జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులవారు శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నందున ఈ ప్రాంతాల్లో శుక్రవారం టిటిడి మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది.
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ జేఈవో
శ్రీ వీరబ్రహ్మం శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్ట ఆలయాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడి స్క్రీన్ లలో కేదార్నాథ్ నుండి ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసమంగాపురం, ఒంటిమిట్టలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజ, ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులతో భరతనాట్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో అన్నమాచార్య సంకీర్తనలు, హరికథ పారాయణం చేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.