తిరుపతి,మా ప్రతినిధి, అక్టోబర్ 30,
తిరుపతి మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 24 గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తుల స్టాల్స్ రైతులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శనివారం టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్టాల్స్‌ను పరిశీలించి తయారీ వివరాలు, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు.
ఇందులో భాగంగా టిటిడి ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయబడుతున్న అగరబత్తులు, ఆయుర్వేద – పంచగవ్య ఉత్పత్తులు, టిటిడి ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలను ఉంచారు.
హైదరాబాద్‌కు చెందిన వజ్ర హెర్బల్ సౌందర్య ఉత్పత్తులు, ఎస్‌పిఎకో ఫూయల్ ఫ్లెక్సి బయోగ్యాస్ ప్లాంట్, చెన్నైకి చెందిన శ్రీరామ్ హెర్బల్ బాత్ పౌడర్, ఆవునెయ్యితో తయారు చేసిన ఫేస్ క్రీమ్, గో మయంతో తయారు చేసిన, ప్రమిదలు, దూప్‌స్టిక్స్, పండ్లపొడి, బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు ఉన్నాయి. కర్నూల్ జిల్లా శ్రీ మహాంకాళి దేవి గో సంరక్షణ శాల నిర్వహకులు శ్రీ చాంద్ బాష పంచగవ్యాలతో తయారు చేసిన పలు రకాల ఉత్పత్తులు ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన పల్లె సృజన వారు ఆకు పసురులతో తయారు చేసిన వరిలో కలుపు, తెగులు నివారించే మందులు, మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే పలు ఉత్పత్తులు ఉంచారు. చిత్తూరుకు చెందిన నిహారిక ఎద్దు గానుగతో ఆడించిన నూనెలైన వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, కుసుమలు, వేప నూనెలు అందుబాటులో ఉంచారు. అనంతపురంకు చెందిన సంజీవని నేచురల్స్‌వారు చిరుధాన్యాలు, వంటనూనెలు, టూత్ పేస్టులు, విజయవాడకు చెందిన గణపతి మునగాకుపొడి, గోదుమగడ్డి పొడి, తిప్పతీగ చూర్ణం, అల్లం పొడి, పెయిన్ రిలిఫ్ ఆయిల్ ఉన్నాయి. గుంటూరుకు చెందిన రైతునేస్తం ఫౌండేషన్ వారు గో సంజీవని, చిరుధాన్యాలు, ప్రకృతి నేస్తాలు, ఔషద వేదం, తదితర రైతులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. తూర్పు గోదావరికి చెందిన బి.ఎస్.ఎమ్ ఫౌండ్రిస్‌వారు పూర్వకాలం నుండి ఉపయోగించే కంచు వంట పాత్రలు, వాటిని ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు ప్రదర్శించారు.
మైసూర్‌కు చెందిన సహజ సీడ్స్‌వారు ఆర్గానిక్ విత్తనాలైన వరి, కాయగూరలు, చిరుధాన్యాలు, బెంగూళూరుకు చెందిన కర్నాటక క్రాఫ్ట్ కలెక్షన్స్‌వారు గ్రాస్ క్రాఫ్ట్స్, ఉడిపి చేనేత చీరలు, డ్రస్సులు, గ్రాస్‌తో చేసిన బ్యాగులు, వివిధ అలంకార వస్తువులు, అరటి బెరడుతో చేసిన మ్యాట్లు, బ్యాగులు, బుట్టులు, కీచైన్లు, ట్రేలు, రాగి ఆకులతో చేసిన వివిధ కళా కృతులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అదేవిధంగా గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులైన ఆవు నెయ్యి, పిడకలు, విబూది, చెట్ల ఆకు, పువ్యులు, బెరడుతో తయారు చేసిన హెర్బల్స్, కలంకారి వస్తువులు, రైతులు గో ఆధారిత వ్యవసాయంతో పండించిన దేశీయ విత్తనాలు, దేశీయ బియ్యం, చిరుధాన్యాలు, నల్ల గోధుమలు, పప్పు దినుసులు ప్రదర్శనలో ఉంచారు.