న్యూఢిల్లీ, నవంబర్ 24
జాతీయ వాహన తుక్కు విధానం కింద పాత వాహనాలను తుక్కుకు ఇచ్చి, కొత్త వాహనాలను కొనేటప్పుడు మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వాలని యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. స్క్రాపేజ్ విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ఆదాయం పెరుగుతుందని, అందుచేత ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చో ఆలోచించాలని జీఎస్టీ మండలిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. కేంద్రం, రాష్ర్టాలకు రూ.40 వేల కోట్ల చొప్పున జీఎస్టీ ఆదాయం వస్తుందని చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 3 నుంచి 4 పాత వాహనాల రీసైక్లింగ్, స్క్రాపేజ్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళిక రచిస్తున్నదని తెలిపారు.వచ్చే రెండేండ్లలో దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే 200 నుంచి 300 కేంద్రాలు ఏర్పాటవుతాయని చెప్పారు. ఆటోమొబైల్ రంగం వార్షిక టర్నోవర్ రూ.7.5 లక్షల కోట్లు అని, దాన్ని ఐదేండ్లలో రూ.15 లక్షల కోట్లకు పెంచాలన్నది తన లక్ష్యమని తెలిపారు. రాష్ర్టాలు స్క్రాపేజ్ విధానంలో ప్రజలు కొనే కొత్త వాహనాలకు రోడ్డు పన్నులో 25 రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. ఢిల్లీలో ప్రారంభమైన స్క్రాపేజ్ కేంద్రానికి ఏడాదికి 24 వేల పాత వాహనాలను తుక్కుగా మార్చి, రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. రూ.44 కోట్ల ఖర్చుతో నెలకొల్పిన ఈ కేంద్రంలో పాత వాహనాలను శాస్త్రీయ పద్ధతిలో తుక్కుగా మార్చడానికి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తామని యాజమాన్యం తెలిపింది.దేశంలో పాత వాహనాలను తుక్కుగా మార్చే తొలి కేంద్రాన్ని గడ్కరీ ప్రారంభించారు. దీన్ని ప్రభుత్వ అనుమతితో మారుతీ సుజుకి-టొయోట్సు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి.