కడప
బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటలకు వరకు 10.49 శాతం పోలింగ్ జరిగింది. అధికారు పోలింగ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. బద్వేలు బాలయోగి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్డ్ పరిశీలిస్తున్నారు. అలాగే పోలింగ్ అధికారులకు తగు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు.
అయితే పలు చోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో.. ఆ పార్టీ నేతలు ఇప్పటికే కిందిస్థాయిలో బీజేపీకి మద్దతిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా బీజేపీకి మద్దతుగా టీడీపీ నాయకులు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ తో బి.కోడురు మండలంలో టీడీపీ నాయకులు కలిసి ఉన్నట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. 223 బూత్ కాలవపల్లె పోలింగ్ ఏజెంట్గా టీడీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి, గోపవరం బూత్-258లో బీజేపీ తరుపున ఇద్దరు ఏజెంట్లుగా టీడీపీ కార్యకర్తలు నారాయణ, నరసింహులు కూర్చున్నట్లు తెలిసింది. మరోవైపు గోపవరం ఎస్ఐపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఏజెంట్లను ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరువెంగళాపురం పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు లేవని సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోరుమామిళ్లలో బయటి వ్యక్తులు వచ్చారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.