హైదరాబాద్
నవంబర్ 15న వరంగల్ నగరంలో లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లడారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామని అయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని తెలిపారు. ఆ తర్వాత ప్రజారంజక విధానాలతో పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్లో నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాలన్నారు. అంతకుముందు విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27న నిర్వహిస్తామని మంత్రి అన్నారు.