న్యూఢిల్లీ నవంబర్ 24
: కొవిడ్-19 బారినపడి మరణించిన వారి వాస్తవ గణాంకాలు బయటపెట్టాలని, బాధిత కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముందుకు తెస్తుందని, బీజేపీ ప్రభుత్వంపై ఈ దిశగా ఒత్తిడి తీవ్రతరం చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.మరోవైపు కొవిడ్ మరణాలపై వాస్తవ గణాంకాలను కేంద్రం వెల్లడించాలని, మహమ్మారి బారినపడి ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. మీరు అధికారంలో ఉంటే ప్రజల కష్టాలను స్వీకరించగలగాలని, బాధిత కుటుంబాలకు పరిహారం అందచేయాలని రాహుల్ ట్వీట్ చేశారు.ఈ వీడియోలో కనిపించిన వారిలో అత్యధికులు గుజరాతీలు కాగా వారంతా కొవిడ్-19 మహమ్మారి విధ్వంసం గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. జాతీయ విపత్తు నిర్వహణం చట్టం కింద కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం చెల్లిస్తామని 2020, మార్చి 14న ప్రభుత్వం నోటిఫై చేసినా ఆపై దాన్ని రూ 50,000కు కుదించారని, మొత్తం రూ 4 లక్షలను బాధిత కుటుంబాలకు చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, పార్లమెంట్ సమావేశాల్లో తాము ఈ అంశం లేవనెత్తుతామని కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ శక్తి సింగ్ గోహిల్ పేర్కొన్నారు.