హైదరాబాద్ నవంబర్ 1
భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ఆస్ట్రేలియా గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆస్ట్రేలియా గుర్తింపు దేశ వ్యాక్సిన్‌కు ఘన విజయం అని పేర్కొన్నారు. ఇకపై కొవాగ్జిన్ తీసుకున్నవారు ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చు అని తెలిపారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించిన విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు.భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కొవాగ్జిన్ టీకా వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావచ్చు అంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్‌కు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకున్నా.. వేలాది మంది ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయాన్ని ఆస్ట్రేలియా వెల్లడించింది. దాదాపు 600 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఆస్ట్రేలియా ఓకే చెప్పింది. దీంతో ఇవాళ్టి నుంచి ఆ దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి మళ్లీ మొదలైంది. ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టాటస్ విషయంలో కొవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తునట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ ఏవో ఇవాళ తెలిపారు.