గోవా అక్టోబర్ 28
అత్యుత్తమ పరిశోధన ఫలితాలు సాధించేందుకు ఉన్నతవిద్యలో బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం విద్యార్థులు కొన్ని విషయాలను నిర్బంధంగా నేర్చుకునేలా ఒత్తిడి చేయడం కంటే, నచ్చిన విషయాలను ఎంచుకుని వాటిలో మరింత ప్రగతి సాధించేందుకు ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. గోవా పనజీలో సంత్ సోహిరోబనాత్ ఆంబియే ప్రభుత్వ కళాశాల భవనం నూతన ప్రాంగణాన్ని గురువారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టే దిశగా ‘వాణిజ్యం’ కీలకమైన అంశమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ-కామర్స్ రంగంలో గణనీయమైన మార్పులు కనబడుతున్నాయని, ఈ దిశగా మరిన్ని మార్పులకు ఉన్నత విద్యాసంస్థలు ముందడుగేయాలని సూచించారు. ఐటీ రంగంలో పురోగతికి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలు ఎంతముఖ్యమో, ప్రకృతి పరిరక్షణలో భాగంగా సీతాకోక చిలుకలతో కూడిన ఓ ఉద్యానవాన్ని ఏర్పాటుచేయడం కూడా అంతే ప్రాధాన్యతాంశమన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో గోవాలోని సంప్రదాయ సంగీత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం ఎంతో ఆకట్టుకున్నది. కళాకారులను ప్రత్యేకంగా స్టేజి మీదకు పిలిపించి వారిని వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్ళై, ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ఉపముఖ్యమంత్రి బాబు అసగావ్‌కర్, గోవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమళ్ రాయ్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.