పెద్దపల్లి ప్రతినిధి అక్టోబర్ 19
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ 21 ఫ్లాగ్ డే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభి రక్తదానం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపద సమయంలో మరొకరి ప్రాణం కాపాడుతుందన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎందరో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల వల్ల ప్రస్తుతం సమాజంలో శాంతి నెలకొందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినట్లు అయితే అట్టి ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసరంగా రక్తం కావాల్సి వస్తుంది, వారికి సరైన సమయంలో రక్తం అందుబాటులో ఉంటే చికిత్స అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ రక్తదానం చేయడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, రక్తదానం చేయడం వలన ప్రజల ప్రాణాలను కాపాడిన వారు అవుతారని, మనతో పాటు మన చుట్టుపక్కల వారి గురించి ఆలోచించడం ద్వారా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ పరోపకారం చేయాలని సూచించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపల్లి పోలీస్ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐ లు రాజేష్, ఉపేందర్, వెంకటేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, జానీ పాషా, రాజ వర్ధన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు