Home ఆంధ్రప్రదేశ్ ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ధ్వజారోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

85
0

తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు  జరిగే ఈ ఉత్స‌వాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 నుండి 10 గంటల మధ్య  ధనుర్లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు మ‌రియుకంకణభట్టార్‌   శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

గజపట ప్రతిష్ఠ :

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన  కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.

సకలదేవతలకు ఆహ్వానం
ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.

రాగ, తాళ నివేదన
రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళాలను నివేదించారు . దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ముగిసింది.

ఈ సంద‌ర్భంగా టిటిడి జెఈవో  వీర‌బ్ర‌హ్మం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహించినట్టు తెలిపారు. ధ్వ‌జారోహ‌ణంతో అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌న్నారు. ఇందులో భాగంగా డిసెంబ‌రు 4న రాత్రి గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 5న రాత్రి గ‌రుడ‌వాహ‌నం, డిసెంబ‌రు 8న పంచ‌మితీర్థం, డిసెంబ‌రు 9న పుష్ప‌యాగం నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.అమ్మ‌వారి క‌రుణ‌తో ప్ర‌పంచ మాన‌వాళి సుభిక్షంగా ఉండాల‌ని, బ్ర‌హ్మోత్స‌వాలు నిర్విఘ్నంగా జ‌ర‌గాల‌ని సంక‌ల్పం చేసిన‌ట్టు వివ‌రించారు.

Previous articleడాలర్ శేషాద్రి పార్ధీవ దేహానికి ప్రముఖుల నివాళి
Next articleప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here