బద్వేలు, అక్టోబర్ -05
ఎన్నికలలో అక్రమాలను నిరోధించడానికి సి – విజిల్ యాప్ ఒక బ్రహాస్త్రంలా పనిచేస్తుందని… ఎన్నికలలో ఎలాంటి అక్రమాలు దృష్టికి వచ్చిన ప్రజలు వెంటనే సి – విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయాలని సబ్ కలెక్టర్ మరియు బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సి విజిల్ యాప్ లో పిర్యాదు అందుకున్న కొద్ది క్షణాల్లో చర్యలు తీసుకుని అక్రమాలకు అడ్డు కట్ట వేయడం జరుగుతుందన్నారు. 124- బద్వేలు నియోజకవర్గ పరిధిలో బద్వేలు ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన మరియు ఎన్నికల వ్యయ ఉల్లంఘన జరిగితే దృష్టికి తేవాలన్నారు. ఎన్నికలలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి విచ్చల విడిగా డబ్బు ఖర్చుపెట్టడాన్ని నిరోధించడానికి భారత ఎన్నికల సంఘం ప్రజల చేతికి ఒక బ్రహ్మాస్త్రాన్ని సి.విజిల్ యాప్ రూపంలో అందించడం జరిగిందని, ప్రతి పౌరుడు భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రజల చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి… దానిలో సి.విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని… ఎన్నికలలో ఎక్కడైనా జరిగే అక్రమాలు దృష్టికి వస్తే వెంటనే వాటిని తమ సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు మరియు ఎవరైనా సభలు, సమావేశాల్లో ఉద్దేశపూరితంగా కామెంట్ చేసినా చిత్రీకరించి అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా కొద్దిగా జోడించి అప్లోడ్ చేసి పంపితే నేరుగా ఎన్నికల కమిషన్ కు వెళ్తాయన్నారు. వారు జిపిఎస్ ట్రాక్ చేసి లొకేషన్ మ్యాప్ చేస్తారని, అక్కడి నుంచి సమీపంలో జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం వెళ్తాయని, వాటిని ఫిర్యాదు చేసిన లొకేషన్ కు దగ్గర్లో ఉన్న ఎన్నికల తనిఖీ బృందాలకు సంబంధిత అధికారులు పంపుతారని… వెంటనే స్పెషల్ పార్టీ రంగంలోకి దిగి అక్రమాలను అడ్డుకుంటారని ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగి పోతుందన్నారు. బెదిరించడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం, ఒకరి కనుగుణంగా వార్తలు ప్రసారం చేయడం, తప్పుడు వార్తలు ప్రసారం, నగదు, బహుమతులను పంపిణీ చేయడం, ఓటర్లను ఉచితంగా తరలించడం, ఆస్తులను నాశనం చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన చిత్రాలను, వీడియోలను సి విజిల్ మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని, పిర్యాదు చేసిన కొద్ది నిమిషాల్లో సమస్యలను పరిష్కరించబడతాయని అన్నారు. స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటింగ్ జరగటానికి సి – విజిల్ అగ్రగామిగా నిలబడుతుందని, ప్రతి పౌరుడు బాధ్యతగా సి – విజిల్ యాప్ గురించి అవగాహన పొంది ఉపయోగించాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.