బెంగళూరు అక్టోబర్ 22
2025 నాటికి దేశ రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యం రూ.35 వేల కోట్లుగా ఉందని కేంద్ర రక్షణా శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన బెంగళూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం తాజ్ వెస్టెండ్‌లో రక్షణా శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. రక్షణ రంగ ఉత్పత్తుల స్థితిగతులు, సాంకేతిక వినియోగం ఇత్యాది అంశాలపై చర్చ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే తొలి 25 దేశాల సరసన చోటు సంపాదించిందన్నారు. అమెరికా, ఇజ్రాయిల్‌తో సహా 84 దేశాలకు భారత్ రక్షణా రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందన్నారు. వీటిలో బుల్లెట్ ఫ్రూప్ హెల్మెట్, ఎలక్ర్టానిక్, ఆటోమొబైల్ ఉత్పత్తులు ఉన్నాయన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రక్షణా శాఖలో 375 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. రక్షణ రంగ సంస్థలైన హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీఈఎంఎల్, డీఆర్‌డీఓ తదితర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌తో పాటు రాజ్యసభ లో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గె కూడా హాజరయ్యారు.