జగిత్యాల అక్టోబర్ 21
జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలు మరియు వాటిని సప్లై చేసే వ్యక్తుల పై, గంజాయి సాగు చేసే వారిపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గంజాయి రవాణా, విక్రయాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి , మరియు డిజిపి సూచించిన సూచనలను జిల్లా పోలీసు అధికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.
ప్రతి పోలీస్ అధికారి తమ ఏరియాలో గంజాయి సాగు మరియు రవాణా వినియోగం పై నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ,ఫారెస్ట్, గ్రామ సర్పంచ్, లతో సమన్వయం చేసుకుని గంజాయిని నిరోధించే విధంగా చూడాలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మిర్చి, పత్తి సాగుతో పాటు గంజాయిని సాగు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలని సూచించారు. నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడ్డ భవనాలలో యువత ఎక్కువగా గంజాయి తీసుకునే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి సేవించేవారు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకుంటున్నారని వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి సేవించే వారి యొక్క డేటాను కలెక్ట్ చేసి వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని మరల అదే విధంగా చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు.గంజాయి నివారణ గురించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని జిల్లాను గంజాయ్ రహిత జిల్లాగా మార్చాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడ్మిన్ ఎస్పీ కె. సురేష్ కుమార్ , డిఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, సి.ఐ లు రాజశేఖర్ రాజు, కిషోర్, కృష్ణకుమార్, కొటేశ్వర్, రమణమూర్తి, శ్రీను, ఎస్.ఐ లు పాల్గొన్నారు.