తిరువనంతపురం నవంబర్ 18
తరాల తరబడి సాగుతున్న అంతరాలు, వివక్షకు తెరదించుతూ కేరళలోని స్వర్గ సమీపంలోని ఎన్మకజెలోని ఆలయంలోకి దళితులు అడుగుపెట్టారు. పట్టికజాతి క్షేమ సమితి (పీకేస్) ఆధ్వర్యంలో దళితుల బృందం ఈ ఆలయంలో ప్రవేశించడంతో పాటు గ్రామంలోని అగ్రవర్ణాలకు కేటాయించిన పవిత్రంగా భావించే 18 మెట్లపైకీ ఎక్కారు. దళితులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి పవిత్రమైన మెట్లను ఎక్కిన పీకేఎస్ బృందం తరాల నుంచి సాగుతున్న అస్పృశ్యత, వివక్షలకు ముగింపు పలికామని ప్రకటించింది.ఆలయంలోకి దళితుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని 1947లోనే రద్దుచేసినా దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో అనాగరిక పద్ధతి కొనసాగుతూనే ఉంది. 1936లో ఆలయ ప్రవేశంపై నిషేధాన్ని తొలగించినా మలబార్ ప్రాంతంలోని కాసర్‌గాఢ్‌లో తొలుత అమలైందని పీకేఎస్ జిల్లా కార్యదర్శి బీఎం ప్రదీప్ చెప్పారు.ఇక ఈ ఆలయంలో గతంలో దళితులను 18 మెట్ల ద్వారా లోపలకి ప్రవేశించేందుకు అనుమతించకపోవడంతో పాటు పూజా కార్యక్రమాలను వీక్షించేందుకూ అనుమతించేవారు కాదని తెలిపారు. దేవుడికి దక్షిణను సైతం వేయనిచ్చేవారు కాదని, కులం ప్రాతిపదికన దేవుడి ప్రసాదాన్ని విడివిడిగా పంచేవారని చెప్పారు.