అమరావతి/నెల్లూరు
అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉద్ధృతంగా సాగుతోంది. అదే జోరు, అదే హుషారు. పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకు సాగారు. నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం అందజేశారు. బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22 వరోజుకు చేరుకుంది. రాత్రి కావలిలో బస చేసిన రైతులు నేడు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు కొనసాగింది. అమరావతి రైతుల మహాపాదయాత్ర 21వ రోజు జైత్రయాత్రలా సాగింది. నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన యాత్రకు.. స్థానికులు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. యాత్రలో వెంకటేశ్వరస్వామి రథంతో పాటు.. అల్లా, జీసస్కు సంబంధించిన వాహనాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అమరావతి రైతులకు కొత్తపల్లిలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు.