తిరుపతి, ,నవంబర్ 03,
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, ప్రముఖుల భద్రతే ధ్యేయంగా నిఘా, భద్రతా సిబ్బంది పనిచేయాలని టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి కోరారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో బుధవారం విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలోని బాంబ్ డిస్పోజల్ బృందం కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఎస్వో మాట్లాడుతూ తిరుమలకు రోడ్డు మార్గంలో, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భక్తులకు భద్రత కల్పిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. తనిఖీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆశీస్సులు అందించాలని శ్రీవారిని, దుర్గామాతను కోరుతూ ఆయుధ పూజ నిర్వహించినట్టు తెలిపారు. అంతకుముందు శ్రీవారు, దుర్గామాత చిత్రపటాలకు, భద్రతాపరికరాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, విఎస్‌వోలు బాలిరెడ్డి, మనోహర్ , ఎవిఎస్వో సాయి గిరిధర్ ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.