విజయవాడ నవంబర్ 1
వైద్యరంగంలో నెలకొన్న మానవవనరుల కొరతను వీలైనంత త్వరగా అధిగమించడంపై దృష్టిసారించడం తక్షణ అవసరమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వైద్యరంగంలోని అన్ని స్థాయిల్లో మౌలికవసతులను మెరుగుపరుచుకోవడం, వైద్యులు, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తుచేసిందని అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆక్సిజన్ ప్లాంట్‌తోపాటు బయోమెడికల్ సదుపాయాలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.వైద్యులు, రోగుల నిష్పత్తి విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉన్నదన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. 2024 నాటికి డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లుగా ప్రతి వెయ్యి మంది రోగులకు ఒక వైద్యుడు ఉండే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటం అభినందనీయమని వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మెరుగుపరిచేందుకు ‘టెలిమెడిసిన్’ అనుసంధానతను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వైద్యులు, వైద్యరంగం సంసిద్ధంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇటీవలి కాలంలో అసంక్రమిత వ్యాధుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, యోగా, ధ్యానాన్ని అలవర్చుకోవడం అత్యంత అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వల్లభనేని వంశీ, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేనిశ్రీనివాస్, సిద్ధార్ధ అకాడమీ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, డీజీ డాక్టర్ సీ నాగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ పీ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ పీఎస్ఎన్ మూర్తితోపాటు అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.