కడప, నవంబర్ 23
: గత కొన్ని రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ బాషా అన్నదాతలకు భరోసా నిచ్చారు.
మంగళవారం .. జవాద్ తుఫాను కారణంగా భారీ వర్షాల వలన దెబ్బతిన్న కడప రూరల్ మండలం లోని పెన్నానది పరివాహక ప్రాంతం పాత కడప – వాటర్ గండి లలో నీట మునిగిన పంటలను , తడిసిన ధాన్యాన్ని , కడప నగర ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే గండి వాటర్ వర్క్స్ లో పాడు అయిన మోటర్ లను నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పరిశీలించారు.
ఈ సందర్బంగా ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ లోని చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో విపరీతమైన వర్షాలు కురియడం వల్ల వరదలు వచ్చాయన్నారు. కడప నగరంలో బుగ్గ వంకకు ఎన్నడూ లేని విధంగా వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రభుత్వం ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి పెనుఉత్పాతం జరగలేదన్నారు.
ఇందుకు కృషిచేసిన కలెక్టర్ విజయరామరాజు నేతృత్వంలోని జిల్లా యంత్రాగాన్ని అబినందిస్తున్నానని తెలిపారు. వరదల్లో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ ఉర్లగడ్డలు, ఒక లీటర్ పామాయిల్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
భారీ వర్షాలతో జిల్లాలోని గండి, మైలవరం, పాపాగ్ని,కుందు నదులలోకి దాదాపు గా 3 లక్ష ల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో నది పరి వాహక ప్రాంతాలైన పాత కడప, వాటర్ గండి ప్రాంతాలలోని 2 వేల ఎకరాలు సాగు లో ఉన్న వరి పంట దెబ్బతిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో రైతులు మనో ధైర్యం కోల్పోవద్దని, ముఖ్యమంత్రి అండగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుంటుందన్నారు. అలాగే దాదాపుగా 1500 ఎకరాల్లో చేతికొచ్చిన పంట వరద నీటిలో మునిగడం వల్ల దెబ్బతిందన్నారు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వమే తడిసిన పంటను మంచి గిట్టు బాటు ధరకు కల్పించి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.జిల్లాలోని వరద వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విదంగా కృషి చేస్తానని తెలిపారు.
నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైయస్ఆర్ జిల్లాలో జవాద్ తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాలతో ప్రభావిత ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. అలాగే కడప నగర పరిధిలోని బుగ్గవంకకు ముందస్తు భద్రాతా చర్యలు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. అలాగే కడప నగర శివార్లలోని పాత కడప, వాటర్ గండి, నానాపల్లి,ఉక్కాయపల్లి ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వారి సంఖ్య ఎక్కువ ఉందన్నారు. 160 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా మైలవరం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు,పాపాగ్ని నుంచి 1.35 లక్షల క్యూసెక్కుల నీరు, బుగ్గవంక నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో పెన్నా నది ఉప్పొంగడం వల్ల వ్యవసాయ భూముల ప్రాంతాల్లో రైతులు పండించిన పంట పూర్తిగా జలమయమయ్యి, రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింద న్నారు. అన్నదాతలకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. అధికారులు, ప్రజలు ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ పర్యటనలో కార్పొరేటర్ చెన్నయ్య, నాయకులు జరుగు రాజశేఖర్ రెడ్డి,ఓబుల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి,ఓబులేసు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.