విజయనగరం అక్టోబర్ 20
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మావోయిస్టు పార్టీ మాదిరిగా మారిందని, ఈ రెండింటి మధ్య తేడా లేదని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. టీడీపీ 36 గంటల దీక్ష చేపట్టిన నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా తాము రాజకీయాల్లో ఉన్నామని, తామెప్పుడూ అలాంటి భాషను మాట్లాడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాధానం ఏంటని బొత్స ప్రశ్నించారు. బీజేపీతో ఉన్నానంటూ చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ సమర్ధన సిగ్గుచేటని, చంద్రబాబుకు సోము వీర్రాజు వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని, చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు తెలపాలని బొత్స డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కారణంగా రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతున్నదని, టీడీపీని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు.