జగిత్యాల అక్టోబర్ 21
అయోడిన్ కలిగిన ఉప్పునే వాడటం వలన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎండి సమియొద్దిన్ అన్నారు. గురువారం స్థానిక మోతేవాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాతీయ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు, వైద్య సిబ్బందికి ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎండి. సమియొద్దిన్ హజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం నిత్యం వాడే ఉప్పులో అయోడిన్ లేక పోవటం వలన అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నామన్నారు.
అయోడిన్ లోపం దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా మారిందన్నారు. థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ అవసరం, కానీ శరీరం స్వయంగా అయోడిన్ను ఉత్పత్తి చేయదని అందువల్ల ఆహారం నుండి అయోడిన్ తీసుకోవడం అవసరం, థైరాయిడ్ హార్మోన్ చాలా ముఖ్యమైన హార్మోన్ ,ఎందుకంటే ఈ హార్మోన్ జీవక్రియ మరియు ఇతర శారీరక విధులను నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ ఏర్పడటానికి అయోడిన్ లేకపోవడం ఆరోగ్యంపై విస్తృత ప్రభావాన్ని చూపుతుందని ఆన్నారు.
అయోడిన్ లోపం ఉన్న స్త్రీకి గర్భస్రావం, మృతశిశవు జననం, తక్కువ బరువు కలిగిన శిశువుకు జన్మను ఇవ్వటం, నరాల లోపాల వలన కలిగే మరగుజ్జుకు జన్మనివ్వటం, జ్ఞాపక శక్తి నశించటం, మానసిక అనిశ్చితి,శారీరక ఎదుగుదల లేక పోవటం, తదితర అనారోగ్య సమస్యలు ఉండే బిడ్డలు జన్మిస్తారన్నారు. అయోడిన్ లోపాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అయోడిన్ లోప నివారణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. దేశంలోని ప్రజలకు అయోడిన్‌ను అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు .మనం రోజూ తినే ఆహారంలో అయోడిన్ ఉప్పులో అయోడిన్ 15 పిపిఎం ఉండాలని, అందరూ అయోడిన్ ఉప్పునే వాడటం ద్వారా ఈ లోపాలను అధిగమించవచ్చని తెలిపారు.
1 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు:: 90-120 మైక్రోగ్రాములు/ రోజుకు
1-11 సంవత్సరాల వయస్సు పిల్లలు: 120 మైక్రోగ్రాములు/రోజుకు
పెద్దలు మరియు టీనేజ్ : 150 మైక్రోగ్రాములు/రోజుకు,
గర్భిణీ స్త్రీలు: 220 మైక్రోగ్రాములు/రోజుకు
నర్సింగ్ తల్లులు: 250 మైక్రోగ్రాములు
అయోడిన్ తీసుకోవాలని డాక్టర్ ఎండి సమియొద్దిన్ తెలిపారు.ఆనంతరం
జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్ ,డాక్టర్ జైపాల్ రెడ్డి ,డాక్టర్ శ్రీపతి మాట్లాడుతూ ఆహారంలో అయోడిన్ తీసుకొకపోవడం వలన హైపోథైరాయిడిజానికి కారణమవుతుందని , ఇది థైరాయిడ్ గ్రంథి పనికిరానిదిగా మారుతుందన్నారు. కాబట్టి ఇది తగినంత మొత్తంలో థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయలేకపోతుంది. హైపోథైరాయిడిజం యొక్క కొన్ని లక్షణాలు స్పష్టమైన కారణం లేకుండా బరువు పెరగడం ,చల్లని ఉష్ణోగ్రతలు ఏకాగ్రతతో ఇబ్బంది పడటం, పొడి చర్మం, మలబద్దకం కండరాలు మరియు నరాల బలహీనత, మహిళల్లో హైపోథైరాయిడిజం అదనపు లక్షణాలను కలిగిస్తుంది, అవి క్రమరహిత రుతు చక్రాలు మరియు గర్భం పొందడంలో ఇబ్బందన్నారు. అయోడిన్ సమృద్దిగా లభించే ఆహార పదార్థాలు ముఖ్యంగా సముద్రం నుంచి వచ్చే ఆహార ఉత్పత్తుల్లో పాల ఉత్పత్తులు, కోడి గుడ్డు, క్యాబేజీ కాలి ప్లవర్ మరియు ఆకుకూరల్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుందని వారు తెలిపారు.
ముఖ్యంగా తినే ఆహారం వండిన తరువాత చల్లారినాక ఈ అయోడిన్ ఉప్పును కలిపితే చాలా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జైపాల్ రెడ్డి ,డాక్టర్ శ్రీపతి, అర్బన్ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ మౌనిక , డాక్టర్ రవి శంకర్,వైద్య సిబ్బంది శోభారాణి, సాగర్ రావు, మురళి, సీనియర్ డిపిఓ స్వామీ ,వంశీ, డెమో తులసి రమణ, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.