మహబూబాబాద్ సెప్టెంబర్ 21
మత్స్యకారుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని పెద్ద చెరువులో ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రహరీ గోడను మంత్రి ప్రారంభించారు.అనంతరం మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులకు పునర్‌వైభవం తీసుకొచ్చామన్నారు. చెరువులపై ఆధారపడ్డ కులాలకు, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముదిరాజ్ లకు చెరువులపై హక్కులు కల్పించి ఆ కులాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. సంక్షేమ పథకాలను కొనసాగించిన నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమే అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.