కోరుట్ల అక్టోబర్ 06
కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు చిత్తశుద్ధి కరువైందని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. బుధవారం మెట్ పెల్లి పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కోరుట్ల నియోజవర్గంలో 2019లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ నిధులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పూర్తిగా విఫలమయ్యారన్నారు. సకాలంలో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాల్సి ఉండగా ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని అన్నారు. ఫలితంగా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ఎంతోమంది పేద ప్రజలు నాణ్యమైన వైద్యం కొరకు జిల్లా కేంద్రాలు మహా నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నో డబ్బులు వెచ్చించి పేద ప్రజలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్పందించి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూత్ పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్, యూత్ నాయకులు కోటగిరి చైతన్య, రంగు అశోక్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.