శ్రీశైలం
పరిపాలనాంశాలలో భాగంగా శనివారం రోజు కార్యనిర్వహణాధికారి వారు గంగాభవాని స్నాన ఘట్టాలను పరిశీలించారు. రాబోవు కార్తికమాసోత్సవాలలో పలువురు భక్తులు ఈ స్నానఘట్టాలలో స్నానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా స్నానఘట్టాల వద్ద అవసరమైన అన్ని మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.స్నానఘట్టాలు ఆలయానికి సమీపంలో ఉన్న కారణంగా ఎక్కువమంది భక్తులు సందర్శించే అవకాశం ఉందన్నారు.అందుకే దర్శనానంతరం భక్తులు సేద తీరేవిధంగా కూడా స్నానఘట్టాల ఎగువ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
స్నానఘట్టాల వద్ద ఉన్న కుళాయిలకు మరమ్మతులు చేసి, అన్ని కుళాయిల ద్వారా కూడా నీరు వచ్చే ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే మరిన్ని కుళాయిలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివలన ఒకే సమయంలో ఎక్కువ మంది భక్తులు స్నానాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.గంగాభవాని స్నానఘట్టాలలో మహిళలు స్నానాలు చేసేందుకు గతంలో ఏర్పాటు చేయబడినస్నానాల గదిని పునరుద్ధరించి, దానిని వినియోగంలోకి తెచ్చే అవకాశం కల్పించాలన్నారు. అదేవిధంగాస్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదికి కూడా అవసరమైన మరమ్మతులు
చేయించాలన్నారు. వీటికి వెంటనే పెయింటింగ్ పనులు చేయించాలన్నారు.
ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలను, పరిసరాలను శుభ్రపరుస్తుండాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు. సుందరీకరణ చర్యలలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. ముఖ్యంగా పూలమొక్కలు నాటాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. దీని వలన స్నానఘట్టాల పరిసరాలు ఆహ్లాదకరంగా వుంటాయన్నారు. అదేవిధంగా స్నానఘట్టాల వద్ద నంది విగ్రహాన్ని, గంగాధర విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ఆలయపుష్కరిణి వద్ద ఏర్పాట్లు
ఆలయపుష్కరిణిలో నిరంతరం నీరు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు పుష్కరిణిలోని జలం శుభ్రంగా వుండే విధంగాను, వినియోగపు నీరు వెలుపలకు వెళ్లేందుకు కూడా చర్యలు చేపట్టాలన్నారు.
పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకుగాను పుష్కరిణి చుట్టు రక్షణ. కటాంజనాలను (సేఫ్టి ఢిల్స్) ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా సుందరీకరణచర్యలలో భాగంగా పుష్కరిణి వద్ద పరమశివుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.ఈ పరిశీలనలో వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి నటరాజరావు, పారిశుద్ధ్య విభాగపు సహాయకార్యనిర్వహణాధికారి ఫణిదర ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు( VC) శ్రీనివాసరెడ్డి, హార్టికల్చరల్ అధికారి లోకేష్,అసిస్టెంట్ ఇంజనీర్లు రంగప్రసాద్, సీతారమేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.