జగిత్యాల నవంబర్ 11
కోవిడ్ టీకాల 100 శాతం లక్ష్య సాధనలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం సావిత్రి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం జగిత్యాల వైద్య ఆరోగ్య ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అరుణశ్రీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్య ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇవ్వడం వలన శిశువు చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా బూతులు తిట్టి గర్భిణీ బంధువులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు ఆశా కార్యకర్తలు పై వివిధ స్థాయిలో గల వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు పాల్పడుతున్నారని వీరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యాక్సినేషన్ జిల్లా కేంద్రాల నుండి పి హెచ్ సి నుండి వ్యాక్సినేషన్ సబ్ సెంటర్ వరకు నేరుగా చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ డ్యూటీ సమయాలను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మార్చాలని సూచించారు. ఒత్తిడి వలన, కోవిడ్ పాజిటివ్ వచ్చిన సెలవు ఇవ్వడం లేదని, సెలవులు మంజూరు చేయాలన్నారు.అలాగే 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్య సాధనలో భాగంగా టీఏ, డీఏ ఇవ్వాలని, గ్రామ స్థాయిలో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ చేసే విధానం నుండి మార్చాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా డాటా ఎంట్రీ చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించాలని కోరారు. వ్యాక్సినేషన్ డ్యూటీ లో ఉన్నప్పుడు పి హెచ్ సి లలో కూడా డ్యూటీలు వేస్తున్నారని అది మార్చాలన్నారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజేశం ఎనుగంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల సత్యనారాయణ తదితరులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్వరూప, మధురిమ, పద్మ, శోభారాణి, నీరజ, వసంత, మమత, సుప్రియ, అరుణ,భాగ్యలక్ష్మి, సుధారాణి ,స్వరూప,వైద్య శాఖ వివిధ విభాగల ఉద్యోగులు పాల్గొన్నారు.