తిరుమల, మా ప్రతినిధి,సెప్టెంబర్ 29,
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తున్న నడక దారి పై కప్పు పనులు దాదాపు పూర్తయిందని, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను అనుమతించనున్నట్లు టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతున్న నడక దారి పైకప్పు పనులను బుధవారం ఈవో, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో టిటిడి చేపట్టిన అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడక దారి పైకప్పు నిర్మాణ పనులు పూర్తయిందన్నారు. తద్వారా భక్తులు నడక మార్గంలో ప్రయాణించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. భక్తులను నడకమార్గంలో అనుమతించిన తర్వాత కూడా టిటిడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పై కప్పు పునః నిర్మాణం సందర్భంగా తొలగించిన కాంక్రీట్ వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి నామాల గోపురం వరకు నిర్మించిన పై కప్పును, మార్గ మధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.