న్యూఢిల్లీ నవంబర్ 29
గోదావరి, కృష్ణ నదులపై ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇవాళ రాజ్యసభలో చర్చించారు. యూపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఈ ప్రశ్నను లేవనెత్తారు. గెజిట్ నోటిఫికేషన్‌ను ఏ రాష్ట్రమైనా ఉల్లంఘిస్తే, ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఆయన అడిగారు. దీనిపై మంత్రి స్పందించాలని కోరారు. అయితే ఆ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ దశలో చైర్మన్ వెంకయ్యనాయుడు టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వెల్‌లోకి దూసుకురావద్దు అంటూ టీఆర్ఎస్ సభ్యుల్ని ఆయన కోరారు. ఎంపీ బండా ప్రకాశ్ పేరును ప్రస్తావించిన చైర్మన్ వెంకయ్య.. ఆయన్న అదుపు చేయాలంటూ ఎంపీ కేశవరావును కోరారు. అయితే సభలో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య ప్రకటించారు. తెలంగాణలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో తెలంగాణ నేతలు సభలో నినాదాలతో హోరెత్తించారు.