న్యూఢిల్లీ నవంబర్ 24
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపైగా ఢిల్లీ శివారులో నిరసనలు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇటీవల గురు పౌర్ణమి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు.ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో రైతు నిరసనలను ప్రేరేపించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ముసాయిదా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నెల 29 నుంచి జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదిస్తే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు చట్టపరంగా రద్దవుతాయి