కోరుట్ల అక్టోబర్ 23
ఎన్నో ఏళ్లుగా మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అధికార, ఉద్యోగ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా కోరుట్ల నియోజకవర్గ మాజీ యూత్ అధ్యక్షులు రాంప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షల ఉద్యోగాలను నియామకం చేశామని చెబుతున్నప్పటికీ మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఖాళీలు వెక్కిరిస్తున్నాయి అని అన్నారు. ఆ లక్షల ఉద్యోగాల్లో మెట్ పల్లి లో నియామకం చేయడానికి ఆ అవకాశం ఎందుకు లభించలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో పదుల సంఖ్యలో అధికార, ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. కొన్ని ఉద్యోగాలను ఇంచార్జిలతో నెట్టుకొస్తున్నప్పటికి మరి కొన్ని పోస్టులు ఏళ్ళతరబడి భర్తీకి నోచుకోవడం లేదన్నారు. అవసరమైన స్థాయిలో బిల్ కలెక్టర్ల నుంచి, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, సహాయ పోస్టులు ఇలా అన్ని కీలక విభాగాల్లో అధికారులు, ఉద్యోగుల కొరత ఉందని అన్నారు. దీంతో పలు అవసరాల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు వారి వారి పనులు సకాలంలో జరగడం లేదన్నారు. మున్సిపల్ కార్యాలయానికి కీలకంగా ఉండే పన్ను వసూళ్లలో లో అవసరమైన స్థాయిలో సిబ్బంది లేరు అని అన్నారు. దీంతో సుమారు గత పదేళ్లుగా నల్ల బిల్లుల వసూళ్లలో ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. ఆస్తిపన్ను వసూళ్లు సైతం లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. ఈ పోస్టులను భర్తీ చేయాలని ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా స్థానికంగా పట్టించుకునే నాథుడే కరువయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ యూత్ జనరల్ సెక్రెటరీ రమేష్ ఎస్సీ సెల్ నాయకులు కంభ సురేష్ నాయకులు పోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.