న్యూఢిల్లీ నవంబర్ 24
ఈ నెల 27 నుంచి సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ఢిల్లీ సరిహద్దుల్లోకి అనుమతిస్తున్నామని, అదే సమయంలో మిగతా వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా డిసెంబర్ 3 వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. దేశ రాజధానిలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని రకాల విద్యా సంస్థలను ఈ నెల 29 నుంచి తిరిగి తెరువనున్నట్లు సమావేశం అనంతరం ప్రకటించారు.గత వారం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఢిల్లీ సీఎం పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను నిలిపివేయడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగలుకు వర్క్‌ఫ్రం హోం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలుష్యం కాస్త తగ్గిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం భవన నిర్మాణాలు, కూల్చివేతలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఉద్యోగుల వర్క్‌ఫ్రం హోంపై త్వరలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.